చేతకానివాళ్లు... పటేల్ యువకులపై యూపీ గవర్నర్ కుమార్తె తీవ్ర వ్యాఖ్యలు

  • పటేల్ యువకులు అసమర్థులు అంటూ వ్యాఖ్యలు
  • అందుకే పటేల్ అమ్మాయిలు ఇతర కులాల్లో పెళ్లిళ్లు చేసుకుంటున్నారని వ్యాఖ్య
  • యువకులు మద్యం సేవిస్తూ జులాయిగా తిరుగుతున్నారని ఆరోపణ
  • ఎప్పుడూ అమ్మాయిలకే ఎందుకు సలహాలిస్తున్నారని సమాజాన్ని ప్రశ్నించిన అనర్ పటేల్
ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్ కుమార్తె, శ్రీ ఖోడల్‌ధామ్ ట్రస్ట్ (ఎస్కేటీ) అధ్యక్షురాలు అనర్ పటేల్ తమ పటేల్ సామాజికవర్గ యువతపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పటేల్ వర్గంలోని యువకులు చాలామంది "అసమర్థులు"గా ఉండటం వల్లే ఆ వర్గానికి చెందిన అమ్మాయిలు ఇతర సామాజిక వర్గాల్లోని యువకులను వివాహాలు చేసుకుంటున్నారని ఆమె అభిప్రాయపడ్డారు. 

సోమవారం గుజరాత్‌లోని బనాస్కాంత జిల్లా గధ్ గ్రామంలో సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఈ సందర్భంగా అనర్ పటేల్ మాట్లాడుతూ.. "మన సమాజంలోని అబ్బాయిలు చాలామంది సమర్థంగా లేకపోవడం వల్లే మన అమ్మాయిలు ఇతర కులాల్లో పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. మన అబ్బాయిలు మద్యం సేవిస్తూ, బయట జులాయిగా తిరుగుతూ, ఏ పనీ చేయకపోతే.. మన అమ్మాయిలు బయట వివాహం చేసుకోక ఏంచేస్తారు? ఈ నిజాన్ని మనం ఎందుకు అంగీకరించడం లేదు? ఎప్పుడూ మన అమ్మాయిలకే ఎందుకు సలహాలు ఇస్తున్నాం?" అని సమాజాన్ని సూటిగా ప్రశ్నించారు. 

అదే సమయంలో, సోషల్ మీడియా, టీవీ ఛానళ్ల ప్రభావాన్ని ఆమె తీవ్రంగా విమర్శించారు. "ఇది సోషల్ మీడియా యుగం. ఈ రోజుల్లో సర్దార్ పటేల్ జీవించి ఉంటే, 562 సంస్థానాలను ఏకం చేయలేకపోయేవారు. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఇంట్లో ఒక నాయకుడు తయారయ్యాడు" అని ఆమె వ్యాఖ్యానించారు. సమాజంలో విభజనలు సృష్టించే వారిని గుర్తించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

Anar Patel
Anandiben Patel
Uttar Pradesh Governor
Patel community
Gujarat news
inter caste marriage
social media
Sardar Vallabhbhai Patel
youth
Gujarat politics

More Telugu News